హిమాలయ దేశం నేపాల్‌ను ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండచరియలు విరిగిపడి గత మూడు రోజుల్లోనే 24 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి పైగా ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. వర్షాల ధాటికి అటవీ ప్రాంతాల్లోని నివాసాలు నేలమట్టమయ్యాయి.
ఒక ప్రాంతంలో ఇళ్లకు సమీపంలోని కొండచరియ సగభాగం క్షణాల వ్యవధిలోనే పేకమేడలా కూలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరదల తీవ్రత పెరగడంతో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పలు నగరాలు, గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రమాదకర ప్రాంతాల్లో చిక్కుకున్న వందలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నేపాల్‌లోని కాళీ, గండకి, నారాయణి, టినౌ నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. సున్‌కోషి, బుధి గండకి, మహాకాళి నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయి. దాంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ వరద హెచ్చరికలు జారీ చేసింది. బాధితులకు సహాయం అందించేందుకు రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి.
వరద ఉద్ధృతికి వందలాది నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 1,500 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాళీ గండకీ నది ఉగ్రరూపం దాల్చడంతో స్యాంగ్జాలోని మీర్మీ డ్యామ్ మూడు గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. 144 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటికే 1,453 మంది ప్రాణాలు కోల్పోగా, 5 వేల మందికి పైగా గల్లంతయ్యారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే తాజా వర్షాలు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి.

