తండ్రి తనతోనే ఉండాలని.. నాలుగేళ్లుగా మృతదేహాన్ని..

ముంబయిలో ఒళ్లు గగుర్పొడిచే విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిపై ఉన్న విపరీతమైన ప్రేమతో ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని తన వద్దే ఉంచుకుంది. ఏకంగా నాలుగేళ్లుగా తండ్రి శవాన్ని డీప్ ఫ్రీజర్‌లో దాచిపెట్టింది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ముంబయిలోని ఓ నిర్మానుష్య భవనం గేటుకు చాలా కాలంగా తాళం వేసి ఉంది. బయట ‘త్వరలో డేకేర్ సెంటర్ ప్రారంభం’ అనే బోర్డు మాత్రమే వేలాడుతోంది. గత కొన్ని నెలలుగా ఆ మూసి ఉన్న ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం మొదలైంది. భరించలేని వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఒక పెద్ద ఫ్రీజర్‌ను తెరిచి చూడగా పోలీసులకు షాక్ తగిలింది. అందులో కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఈ ఇంటికి అప్పుడప్పుడు ఓ మహిళ వచ్చి వెళ్లేదని స్థానికులు విచారణలో వెల్లడించారు. ఆ మహిళ ప్రస్తుతం ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసిస్తోంది.

పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించారు. ఆమె తన వాంగ్మూలంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి తన సొంత తండ్రి అని చెప్పింది. ఆయన తీవ్ర క్యాన్సర్‌తో బాధపడుతూ 2022 జూన్‌లో మృతి చెందారని తెలిపింది. చిన్నతనం నుంచే తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. ఆయన ఎప్పటికీ తనతోనే ఉండాలనే కోరికతో ఈ పని చేసినట్లు వివరించింది.

మృతదేహాన్ని శాశ్వతంగా భద్రపరిచేందుకు అమెరికాలోని ఒక ప్రత్యేక సంస్థను సంప్రదించినట్లు ఆమె తెలిపింది. శవాన్ని అక్కడికి తరలించడానికి భారీగా డబ్బు ఖర్చవుతుందని చెప్పింది. ఆ మొత్తం సమకూర్చేందుకే నాలుగేళ్లుగా డబ్బు పొదుపు చేస్తున్నానని పేర్కొంది. అంతవరకు మృతదేహం చెడిపోకుండా ఉండేందుకే ఫ్రీజర్‌లో ఉంచినట్లు వివరించింది. తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియలు చేయడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.