తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరి పేర్లను ఆమోదించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రెండు కీలక స్థానాలకు కాంగ్రెస్ నాయకత్వం పేర్లను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సామ రామ్మోహన్ రెడ్డి ఎంపికయ్యారు. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
సామ రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా ఉన్నారు. పార్టీలో ముఖ్య అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా సేవలందించి పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి ఎంపికైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన నాయకుడు. ఈయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. సర్వోత్తమ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా కాలంగా చురుగ్గా పనిచేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
అనుభవజ్ఞులు, యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.

