సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆహారం తీసుకురావడం ఆలస్యమైందనే ఆగ్రహంతో ఒక దంపతులు జొమాటో డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే, వాసవినగర్‌కు చెందిన దంపతులు జొమాటో యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అయితే యాప్‌లో కస్టమర్ లొకేషన్ తప్పుగా చూపించింది. దీంతో చిరునామా వెతకడంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చివరకు డెలివరీ బాయ్ ఆశి సరైన ఇంటికి చేరుకునేసరికి ఆర్డర్ కాస్త ఆలస్యమైంది.
ఆర్డర్ తీసుకురావడం లేట్ అయిందనే కోపంతో ఆ దంపతులు ఆశితో వాగ్వాదానికి దిగారు. లొకేషన్ సమస్య వల్లే ఆలస్యమైందని ఆశి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం వినలేదు. సహనం కోల్పోయి అతడిపై చేయి చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో ఆశిని తీవ్రంగా కొట్టారు.
ఈ మొత్తం దాడి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

