ముమ్మాటికీ లైంగిక దాడితో సమాన‌మే: విజయ్

దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలో కథానాయిక జాన్వీ కపూర్‌ను అసభ్యంగా చూపిస్తూ కొందరు నెట్టింట మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేశారు. కృత్రిమ మేధస్సును దుర్వినియోగం చేస్తూ రూపొందించిన ఈ వీడియోలపై సినీ పరిశ్రమ తీవ్రంగా మండిపడింది. ఈ వికృత చేష్టలపై ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. సమాజంలో మనుషులు ఎంత దిగజారిపోయారో ఈ చర్య నిరూపిస్తోందని ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి పనులకు ఒడిగట్టిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇతరులను కించపరిచి ఆనందం పొందేలా పిల్లలను పెంచుతున్నారా అని ప్రశ్నించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని ప్రపంచం భయపడుతుంటే, కొందరు దానిని ఇలాంటి నీచమైన పనులకు వాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికీ డిజిటల్ లైంగిక దాడితో సమానమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నటుడు కల్యాణ్ రామ్ కూడా దీనిపై తీవ్ర నిరసన తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను వాడుకుని ఒక మహిళను ఇలా అవమానించడం అత్యంత దారుణమైన విషయమని ఆయన అన్నారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే కఠినమైన చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు.

సీనియర్ నటి ఖుష్బూ ఈ ఉదంతంపై భావోద్వేగంగా స్పందించారు. మహిళల గౌరవాన్ని కాలరాసేలా ఇలా ఏఐని వాడటం సిగ్గుచేటని అన్నారు. ఒకరిని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ వీడియోలు చేయడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ఈ రోజు బాధితురాలిగా జాన్వీ ఉంటే, రేపు మన కుటుంబాల్లోని ఏ మహిళకైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు. స్త్రీల శరీరం ఏఐ కంటెంట్ కాదని, ఆమె గౌరవం ఎవరికీ వినోదం కాదని చెబుతూ జాన్వీకి పూర్తి మద్దతు ప్రకటించారు.