ట్రిపుల్‌ మర్డర్‌ కేసు.. ముందు ఏఐతో నిందితుడి ప్లాన్!

బెంగళూరు పరిధిలోని కేఆర్‌పురంలో గత జూన్‌లో జరిగిన ట్రిపుల్‌ మర్డర్‌‌ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో ఈ ఘోరానికి ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ హత్యల వెనుక ఉన్న భయానక అంశాలను పోలీసులు తాజాగా సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.

నిందితురాలు శ్వేత తన కుటుంబం తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని భావించింది. ప్రియుడు కెనెత్‌తో కలిసి ఆమె తన సొంత కుటుంబాన్నే అంతం చేయాలని నిర్ణయించుకుంది. శ్వేత తండ్రి సోమసుందర, తల్లి ముత్తులక్ష్మి, సోదరి సుప్రియను వీరిద్దరూ అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

దర్యాప్తులో భాగంగా టెక్కీ అయిన కెనెత్‌ ల్యాప్‌టాప్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హత్యలకు ముందు అతడు ఏఐ ద్వారా నేరానికి సంబంధించిన సమాచారాన్ని శోధించినట్లు గుర్తించారు. మనుషులపై ఎలా దాడి చేయాలి, వారిని ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలనే అంశాలను ఏఐ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఒకేసారి ముగ్గురు వ్యక్తులపై ఎలా దాడి చేయాలనే విషయాలపై అతడు ప్రశ్నలు అడిగాడు. వంటింట్లో వాడే కత్తితో దాడి చేసే విధానాలను శోధించాడు. కారంపొడి, వెనిగర్ ఉపయోగించి కంటిచూపు కోల్పోయేలా చేయడంపై వివరాలు సేకరించాడు. బాధితులు తప్పించుకోకుండా మోకాళ్లు విరగ్గొట్టడం, ప్రమాదకరమైన ఆయుధాల వినియోగం గురించి కూడా ఏఐని అడిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఛార్జ్‌షీట్ ప్రకారం.. శ్వేత తన ప్రియుడు కెనెత్‌‌ కోసం దాదాపు రూ.52 లక్షల వరకు అప్పు చేసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. ఆ గొడవల నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. పక్కా ప్రణాళికతోనే ఈ దారుణాన్ని అమలు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.