ఒలింపిక్స్‌ 2036 రేసులో భారత్‌.. ఐఓసీ కీలక ప్రకటన!

ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారత దేశ కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల రేసులో భారత్‌ నిలిచిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అధికారికంగా ధ్రువీకరించింది. భారత్‌తో పాటు ఖతార్‌ కూడా ఈ పోటీలో ప్రధానంగా నిలిచింది. ఈ రెండు దేశాలే కాకుండా మరో ఐదు దేశాలు కూడా ఆతిథ్యం కోసం ఆసక్తి చూపుతున్నట్లు ఐఓసీ వర్గాలు తెలిపాయి.

వందకు పైగా సభ్యులు ఉన్న అసోసియేషన్‌ 2029లో ఓటింగ్ నిర్వహించి ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనుంది. ప్రస్తుతానికి భారత్, ఖతార్‌ ఫేవరెట్‌లుగా కనిపిస్తున్నాయి. కేవలం 2036 ఎడిషన్‌కే కాకుండా 2040, 2044 ఒలింపిక్స్ కోసం కూడా పలు దేశాలు ముందస్తు చర్చలు జరుపుతున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, హంగరీ, తుర్కియే దేశాలు ఉన్నాయి. బిడ్డింగ్‌ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన 30 పేజీల డాక్యుమెంట్‌ను కూడా ఐఓసీ విడుదల చేసింది.

ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అథ్లెట్లే కేంద్రంగా ఏర్పాట్లు ఉండాలని ఐఓసీ అధ్యక్షురాలు కిర్‌స్టీ కోవెంట్రీ పేర్కొన్నారు. 2036 వేదిక కోసం బిడ్డింగ్‌ వేయడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2028 ఒలింపిక్స్ లాస్‌ ఏంజెలెస్‌లో, 2032 క్రీడలు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో జరగనున్నాయి.

భారత్‌ విషయానికి వస్తే గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ఒలింపిక్స్‌ నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. అటు 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు కూడా భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన ఖతార్‌ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. సియోల్‌ వేదికగా దక్షిణ కొరియా, మ్యూనిచ్‌ వేదికగా జర్మనీ కూడా మరోసారి అవకాశం కోసం చూస్తున్నాయి. ఆఫ్రికా ఖండం నుంచి తొలిసారి ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా రంగంలోకి దిగింది. బుడాపెస్ట్ (హంగరీ), ఇస్తాంబుల్ (తుర్కియే) నగరాలు కూడా ఈ ప్రతిష్ఠాత్మక రేసులో తలపడుతున్నాయి.