భర్తను చంపి.. అండమాన్‌లో దొరికిపోయిన భార్య!

విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య కడతేర్చింది. మూడేళ్ల తర్వాత నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ వివరాలను నగర డీసీపీ వీఎన్‌ మణికంఠ మీడియాకు వెల్లడించారు.

భీమిలి మండలం వలందపేటకు చెందిన వంక పైడిరాజు కూలి పనులు చేసేవాడు. అతని భార్య జ్యోతికి జాలరి ఎండాడకు చెందిన వాడమొదుల నూకరాజుతో వివాహేతర సంబంధం ఉంది. వీరి వ్యవహారానికి పైడిరాజు అడ్డంకిగా మారాడు. దాంతో అతడిని అంతమొందించాలని పథకం వేశారు. 2022 డిసెంబరు 27న నూకరాజు స్నేహితుడు భూలోకతో కలిసి ప్లాన్ అమలు చేశారు. జ్యోతి భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. పైడిరాజు నిద్రలోకి జారుకున్నాడు.

ఆ తర్వాత నూకరాజు, భూలోక ఇంట్లోకి ప్రవేశించారు. పైడిరాజు గొంతును ట్యాగ్ వైర్‌తో బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడని తప్పుడు సమాచారం ఇచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. డిసెంబరు 30న భర్త కనిపించడం లేదంటూ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మృతుడి సోదరుడు చిన్నారావుకు నూకరాజుపై అనుమానం వచ్చింది. అతడు 2023 జనవరి 12న పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. హత్య విషయం తెలియడంతో ముగ్గురిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు.

అయితే బెయిల్ తర్వాత కోర్టు విచారణకు హాజరుకాకుండా జ్యోతి, నూకరాజు పరారయ్యారు. పిల్లలతో కలిసి చెన్నై మీదుగా బోటులో అండమాన్‌ చేరుకున్నారు. అక్కడ స్వరాజ్‌ద్వీప్‌లో నకిలీ ఆధార్‌ కార్డులతో జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను విశాఖకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.