కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత ఎం.ఎ. అబ్దుల్ గఫూర్ కుమారుడు కిరణ్ ఆకస్మిక మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిరణ్ అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రముఖ సంస్థలో కిరణ్ సీనియర్ డేటా సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్న కిరణ్ హఠాన్మరణం తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు ఇంత చిన్న వయసులోనే తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు.
కన్నకొడుకును కోల్పోయిన అబ్దుల్ గఫూర్, పి. నిర్మల దంపతుల దుఃఖం వర్ణనాతీతమని జగన్ పేర్కొన్నారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

