మహారాష్ట్రలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. మొత్తం 358 తాలూకాల్లో 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. ముఖ్యంగా మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ కరువు 1972 నాటి మహా కరువు కంటే దారుణంగా ఉండే ప్రమాదం ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈసారి కరువు ప్రభావం పండ్ల తోటలపై భారీగా పడింది. నాసిక్‌లో ద్రాక్ష తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి. మామిడి, దానిమ్మ, నారింజ, అరటి తోటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. సాధారణ పంటలు పోతే ఒక సీజన్ నష్టం మాత్రమే జరుగుతుంది. కానీ పండ్ల చెట్లు ఎండిపోతే రైతులు కోలుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది. మళ్లీ కొత్త తోటలు పెంచి దిగుబడి పొందడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని రైతులు వాపోతున్నారు.
గ్రామాల్లో తాగునీటికి, పశువుల మేతకు తీవ్ర కొరత ఏర్పడింది. ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ఓ రైతు ట్యాంకర్ల నీటి కోసం రోజుకు రూ. 3 వేలు ఖర్చు చేస్తున్నారు. మరాఠ్వాడాలోని వందలాది గ్రామాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఓవైపు రైతులు కన్నీరు పెడుతుంటే, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నాందేడ్‌లో జరిగిన కరువు సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధుల ముందు జీడిపప్పు, బాదం ఉంచడం విమర్శలకు దారితీసింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరువు నుంచి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం రుణాల రీషెడ్యూల్, పన్ను రాయితీలు ప్రకటించింది. అలాగే కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధుల సాయం కోరింది. కేంద్ర బృందం కూడా పంట నష్టాన్ని పరిశీలించింది. రైతులకు వెంటనే సాగు, తాగునీరు అందించడమే ఇప్పుడు అత్యంత కీలకమైన సవాలుగా మారింది.
ఎల్‌నినో ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు నెలకొన్నాయితెలంగాణలో నైరుతి రుతుపవనాల కాలంలో దాదాపు 17% లోటు వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లోని సుమారు 215 నుంచి 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి.
కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలోని సుమారు 21 వేల చెరువుల్లో 17 వేలకు పైగా చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరు మాత్రమే ఉంది.సాగునీరు, విద్యుత్ కొరత దృష్ట్యా రైతులు ఈసారి యాసంగి పంటలు వేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. తాగునీటి సరఫరాను కాపాడేందుకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జూన్-ఆగస్టు మధ్య ఏకంగా 53.4% వర్షపాత లోటు ఏర్పడటంతో, ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర కరువు ఎదుర్కొంటున్నాయి.
రాయలసీమలోనే దాదాపు 186 మండలాలు కరువు బారిన పడ్డాయి. వేలాది బోర్లు ఎండిపోవడంతో వేరుశనగ, పత్తితో పాటు మామిడి, నిమ్మ తదితర పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా ప్రధాన ప్రాజెక్టుల్లో గత ఏడాదితో పోలిస్తే అందుబాటులో ఉన్న నీటి పరిమాణం మూడో వంతుకు పడిపోయింది. తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మొదలైంది.

