ఆ ఓట్లు తొలగించాలనే SIR తీసుకొచ్చారు: సీఎం రేవంత్‌

రాజ్యాంగం ప్రతి పౌరుడికీ పవిత్రమైన ఓటు హక్కును కల్పించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఓటు హక్కు కల్పించడానికి చేపట్టిన ప్రక్రియలను ఇప్పుడు ఓట్లు తొలగించడానికే వాడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం అక్కడ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ సంస్థలతో ఫలితం లేకపోవడంతో నేరుగా ఎన్నికల సంఘాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను తొలగించేందుకే ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఇచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. భాజపా వ్యతిరేకుల ఓట్లను జాబితా నుంచి తొలగించడమే ఆ టాస్క్ అని ఆరోపించారు. దేశంలో ప్రధానంగా యువత, నిరుద్యోగులు, పేద ప్రజలు భాజపా విధానాలను వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. అందుకే ఆ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించేందుకు జ్ఞానేశ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల సంఘం నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని రేవంత్ గుర్తుచేశారు. జ్ఞానేశ్‌కుమార్‌ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అలాంటి అధికారిని పదవి నుంచి తొలగించడానికి మోదీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలైన బిహార్, బెంగాల్‌లలో భాజపాకు అనుకూల ఫలితాలు వచ్చాయని రేవంత్ వివరించారు. ఈ ప్రక్రియ జరగని రాష్ట్రాల్లో మాత్రం భాజపా ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఏటా జనాభా వేగంగా పెరుగుతోందని తెలిపారు. జనాభా పెరిగినప్పుడు సాధారణంగా ఓటర్ల సంఖ్య కూడా పెరగాలి కదా అని నిలదీశారు. మరి ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గిందో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.