ఢిల్లీ పోలీసుల సంచ‌ల‌న నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు కేంద్ర బిందువుగా ఉండే జంతర్ మంతర్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిరసన వేదికల అధికారిక జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించింది. వరుస ఆందోళనల వల్ల స్థానికంగా తలెత్తుతున్న సమస్యలు, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించిన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను ఖరారు చేశారు. నిరసనకారులు ఇకపై రామ్‌లీలా మైదాన్, బురాడీ మైదాన్ లేదా సీబీడీ గ్రౌండ్స్‌లో మాత్రమే ఆందోళనలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రదేశాల్లో ధర్నాలు చేయడానికి పోలీసుల ముందస్తు అనుమతులు, నిర్దేశిత సమయాలు, భద్రతా నిబంధనలు తప్పనిసరి కానున్నాయి.

మరోవైపు ఈ నిర్ణయంపై ప్రజా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును కాలరాస్తున్నారని సీజేపీ నేతలు ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన అనుమతి కోసం వెళ్లిన నాయకులకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఆందోళనకు పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు గడువు విధించారు.

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల గళం వినిపించేందుకు దశాబ్దాలుగా జంతర్ మంతర్ ప్రధాన వేదికగా నిలిచింది. అయితే నడిబొడ్డున ఉండటం వల్ల తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయన్న అంశం గతంలో కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు ఈ వేదికను మార్చడంతో దేశ రాజధానిలో ప్రజా ఉద్యమాలు, రాజకీయ ఆందోళనల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.