మలయాళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బేల్రాజ్ కలరిక్కల్ (27) హఠాన్మరణం చెందారు. ఆయన తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరుసటి రోజే ఈ విషాదం జరగడం అందరినీ కలచివేసింది.
కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయనకు దర్శకుడిగా మారాలనేది చిరకాల స్వప్నం. ‘కప్పి స్క్వాడ్’ (Kappi Squad) అనే వెబ్ సిరీస్తో ఆ కలను నెరవేర్చుకున్నారు. ఈ సిరీస్ శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో విడుదలైంది. తొలి ప్రయత్నంతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ నెరవేరింది.
సిరీస్ విడుదలైన ఆనందాన్ని పూర్తిగా అనుభవించకముందే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. 27 ఏళ్ల పిన్న వయసులోనే ఆయన తనువు చాలించడం కుటుంబసభ్యులను, చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది.
బేల్రాజ్ కలరిక్కల్ వ్యక్తిగత జీవితంలోనూ ఇటీవలే ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. ఆరేళ్లపాటు ప్రేమించిన తన ప్రియురాలిని గత నెలలోనే ఆయన వివాహం చేసుకున్నారు. కొత్త కాపురం మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దర్శకుడిగా మారకముందు ఆయన ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘నిళల్’, ‘మధురం’, ‘డాకిని’ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా సేవలందించారు. పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.
తొలి సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమైన రోజే దర్శకుడు కన్నుమూయడంపై మలయాళ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.

