భర్తను చంపిన మహిళ… కోర్టు చరిత్రాత్మక తీర్పు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. భర్తను అత్యంత కిరాతకంగా చంపి, పాముకాటు వల్ల చనిపోయినట్లు నమ్మించేందుకు యత్నించిన రవిత అనే మహిళకు, ఆమె ప్రియుడికి కోర్టు మరణశిక్ష విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం వారిద్దరినీ దోషులుగా తేలుస్తూ ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది.

మేరఠ్‌ పరిధిలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అమిత్ కశ్యప్‌కు, అమర్‌దీప్‌ అనే వ్యక్తితో స్నేహం ఉండేది. అమర్‌దీప్ తరచూ అమిత్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో అమిత్ భార్య రవితతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య వ్యవహారం గురించి అమిత్‌కు తెలియడంతో దంపతుల మధ్య నిత్యం తీవ్ర ఘర్షణలు జరిగేవి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని రవిత పథకం వేసింది.

గతేడాది ఏప్రిల్‌లో ఒక రాత్రి అమిత్ గాఢ నిద్రలో ఉండగా రవిత అతడి గొంతు నులిమి హత్య చేసింది. హత్య నేరం తనపై పడకుండా ఉండేందుకు ఆమె తన ప్రియుడు అమర్‌దీప్ సాయంతో పథకం ప్రకారం ఓ పామును కొనుగోలు చేసింది. హత్య అనంతరం ఆ పామును భర్త నిద్రిస్తున్న దుప్పట్లో వదిలిపెట్టింది. మరుసటి రోజు ఉదయం తన భర్త పాముకాటు వల్లే మృతి చెందాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అమిత్ శరీర భాగాలపై పాము కాట్లు ఉండటంతో తొలుత ఎవరికీ అనుమానం రాలేదు.

అయితే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడంతో అసలు నిజం బయటపడింది. అమిత్ ఊపిరాడక చనిపోయాడని వైద్యుల నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా దుస్తుల్లో పట్టుబడిన పాము విషపూరితమైనది కాదని తేలింది. ఈ ఆధారాలతో పోలీసులు రవితను తమదైన శైలిలో విచారించగా అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. తామే హత్య చేసి నాటకమాడినట్లు ఇద్దరూ అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. న్యాయస్థానం విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష విధించింది.