యూరప్‌లో నిరసనల హోరు.. పెరుగుతున్న‌ ప్రజాగ్రహం!

ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, మానవ హక్కులపై నీతులు చెప్పిన ఐరోపా ఖండం ఇప్పుడు అగ్నిపర్వతంలా మండుతోంది. ఫ్రాన్స్ ఒక్కటే కాకుండా బెల్జియం, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ తదితర ప్రముఖ యూరప్ దేశాలు తీవ్రమైన నిరసనలతో అట్టుడుకుతున్నాయి. విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల మరియు గృహ నిర్మాణ సంక్షోభంతో విసిగిపోయిన లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ నిరసనలు కొన్ని ప్రాంతాలలో తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఫ్రాన్స్‌లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. రాజధాని పారిస్‌తో పాటు వివిధ నగరాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని చోట్ల ప్రముఖ వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. లిమోగెస్ నగరంలో ఏకంగా పురపాలక సంఘం (టౌన్ హాల్) భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో భవనం కొంత భాగం దగ్ధమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ సహా పలు దేశాల భద్రతా బలగాలు బాష్పవాయువు, వాటర్ కెనాన్‌లను ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో వేల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, సామాన్యులకు నివాసాలు కరవవడంపై యువత, కార్మికులు ఉద్యమబాట పట్టారు. ఇటలీ, బెల్జియంలలో కూడా పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఒకనాడు ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఈ దేశాలు.. ఇప్పుడు అంతర్గత ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణ సవాళ్లతో సతమతమవుతున్నాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, చేసిన తప్పులకు, విధానపరమైన లోపాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే కర్మ సిద్ధాంతాన్ని తలపించేలా ప్రస్తుత యూరప్ పరిస్థితులు మారాయి.