రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో అద్భుత రికార్డు నమోదైంది. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఏకంగా క్వాడ్రుపుల్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 510 బంతులు ఎదుర్కొన్న సుతార్ 46 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మైదానంలో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ బ్యాటర్ 400 పరుగుల మైలురాయిని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 1948లో మహారాష్ట్ర తరఫున ఆడిన బిబి నింబాల్కర్ 443 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తొలి క్వాడ్రుపుల్ సెంచరీ సాధించాడు. మళ్లీ 78 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిన్మయ్ సుతార్ ఈ అరుదైన మైలురాయిని సమం చేశాడు. రంజీ చరిత్రలో నింబాల్కర్, సుతార్ తప్ప మరే బ్యాటర్ ఈ ఘనత సాధించలేకపోయారు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా పేరిట ఉన్న రికార్డును సుతార్ బద్దలు కొట్టాడు. 2022లో పృథ్వీ షా అసోంపై 379 పరుగులు సాధించాడు. ఇప్పుడు సుతార్ 400 పరుగులతో రంజీల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా నిలిచాడు. నింబాల్కర్ (443*), సుతార్ (400*) తర్వాత పృథ్వీ షా (379), సంజయ్ మంజ్రేకర్ (377), ఎం.వి. శ్రీధర్ (366), తన్మయ్ అగర్వాల్ (366) వరుస స్థానాల్లో ఉన్నారు.
తాజా ప్రదర్శనతో సుతార్ అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారాల సరసన స్థానం దక్కించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో వీరితో కలిపి కొద్దిమంది మాత్రమే క్వాడ్రుపుల్ సెంచరీలు సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (501*) రికార్డు ఇప్పటికీ బ్రియాన్ లారా పేరిటే కొనసాగుతోంది. సుతార్ నమోదు చేసిన ఈ అద్భుత ఇన్నింగ్స్ దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది.

