అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 76 ఏళ్ల వృద్ధురాలు తన మాజీ భర్తను, ఆయన ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపింది. ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉవాల్డా ప్రాంతంలోని మెక్‌నాట్ ఫాల్స్ రోడ్డులో ఉన్న ఒక ట్రైలర్ హోమ్‌లో ఈ ఘటన జరిగింది.
నిందితురాలిని టూంబ్స్ కౌంటీకి చెందిన గ్రేస్ ఎడ్జ్ (76)గా పోలీసులు గుర్తించారు. ఆమె సోమవారం మధ్యాహ్నం తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే విచక్షణారహితంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఆమె మాజీ భర్త వాలెస్ ట్రూమాన్ ఎడ్జ్ (75), ఆయన ప్రియురాలు పమేలా కుక్ (40) అక్కడికక్కడే మరణించారు. కాల్పుల సమయంలో నిందితురాలు గ్రేస్ చేతికి కూడా స్వల్ప గాయమైంది.
ఘటన జరిగిన సమయంలో పమేలా తల్లి డయాన్ కుక్ ఇంట్లోనే ఉన్నారు. ఆమె వెంటనే అత్యవసర విభాగం 911కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎలాంటి గొడవ జరగకుండానే గ్రేస్ లోపలికి వచ్చి కాల్పులు జరిపినట్లు డయాన్ తెలిపారు. గ్రేస్, వాలెస్ దంపతులు పదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ వారి మధ్య మాటలు, సంబంధాలు కొనసాగాయి.
తన కంటే 35 ఏళ్లు చిన్నదైన పమేలా కుక్‌తో వాలెస్ డేటింగ్ చేయడం గ్రేస్‌కు నచ్చలేదు. ఈ సంబంధంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉంది. గతంలో కూడా వీరి మధ్య విభేదాలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అప్పట్లో ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పుల అనంతరం గ్రేస్ ఎడ్జ్ స్వయంగా షెరీఫ్ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయింది. ఆమెపై రెండు హత్య కేసులు సహా ఏడు అభియోగాలు నమోదు చేసి జైలుకు తరలించారు.

