ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారు. కడపలోని పార్టీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం నుంచి వారిని బయటకు లాక్కెళ్లడంతో కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోనూ పలువురు సీనియర్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నామినేషన్లలో పాల్గొనకుండా పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఇళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తమ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లకుండా నేతలను నిర్బంధించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
మరోవైపు క్షేత్రస్థాయిలో నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేశారు. అభ్యర్థుల వాహనాలపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలను సిద్ధం చేసుకుని భయానక వాతావరణం సృష్టించాయి. కుప్పం పరిధిలో పార్టీ మండల అధ్యక్షుడు బుల్లెట్ దండపాణిని అదుపులోకి తీసుకుని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికార పార్టీ నేతలు, పోలీసులు ఏమాత్రం లెక్కచేయడం లేదని ప్రతిపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోటీకి భయపడి కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యలను న్యాయస్థానాల్లో నిలదీస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.

