ఫౌజీ.. ‘ఫైల్ నెంబర్ 25’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే ఆసక్తికర టైటిల్ ఖరారైంది. ఇందులో ఇమాన్వి కథానాయికగా పరిచయం అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రబృందం తాజాగా ‘ఫైల్ నెంబర్ 25’ పేరిట ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా కథా ప్రపంచాన్ని, కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు. పుట్టుకతో వచ్చిన పేరు ఎవరికీ తెలియని ఒక యోధుడి కథ ఇది. బ్రిటిష్ పాలకులు అతన్ని ‘ఫౌజీ’ అని పిలిచేవారని చూపించారు. అతడు కేవలం సైనికుడు మాత్రమే కాదు. గొప్ప వ్యూహకర్త, చాకచక్యమైన గూఢచారి కూడా. 1932 నుంచి బ్రిటిష్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉంటూ మాతృభూమిని కాపాడుతుంటాడు.

ఈ ప్రచార చిత్రం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి నేపథ్యంలో మొదలవుతుంది. జర్మనీలోని బెర్లిన్ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య సంభాషణతో సన్నివేశం ఆరంభమవుతుంది. భగవద్గీత ఆధారంగా ఫౌజీ ఒక అజేయమైన రహస్య కోడ్‌ను రూపొందించాడని సుభాష్ చంద్రబోస్ వివరిస్తారు. ఆ కోడ్‌ను ఛేదించడం ఎనిగ్మా యంత్రం కంటే కష్టమని బ్రిటిష్ వారు అంగీకరించినట్లు చెబుతారు.

ప్రచార చిత్రంలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ విశేషంగా ఆకట్టుకుంది. ఆయన లుక్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంటోంది.