భర్త మరొక మహిళతో సంబంధం.. మద్రాస్ హైకోర్టు కీల‌క తీర్పు

భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండటం భార్యపై చూపించే ‘క్రూరత్వం’ కిందికి రాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సుందర్ మోహన్ కీలక తీర్పు వెల్లడించారు. బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సమర్థించారు. నిందితుడైన భర్తను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ మృతురాలి సోదరుడు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, దంపతులకు 2008లో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత వరకట్నం కోసం భర్త తనను వేధించాడని ఆరోపణలు వచ్చాయి. అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ, తన ఏడాదిన్నర బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు భర్తను నిర్దోషిగా విడుదల చేసింది.

ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. భర్త ప్రవర్తనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిందని వాదించారు. అయితే, ఆరోపణలను నిరూపించడానికి సరైన ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది.

కేవలం వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన ఐపీసీ సెక్షన్ 498ఏ వర్తించదని న్యాయమూర్తి వివరించారు. అది భార్యను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పే స్థాయి తీవ్రమైన అంశం అని ప్రభుత్వం నిరూపించలేకపోయిందని కోర్టు గుర్తించింది. కేసు పూర్వాపరాల ప్రకారం బలవంతపు ఆత్మహత్యకు ఆధారాలు లేవని నిర్ధారించింది. అందువల్ల పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.