హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని భూములు, ప్లాట్ల ఈ-వేలానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విక్రయాల్లో భాగంగా కోకాపేటలో ప్రభుత్వం రికార్డు స్థాయి కనీస ధరను నిర్ణయించింది. నియోపొలిస్ లేఅవుట్లోని సర్వే నంబర్లు 239, 240లలో ఉన్న 4.59 ఎకరాలను అమ్మకానికి ఉంచారు. ఇక్కడ ఎకరా కనీస ధరను ఏకంగా రూ.120 కోట్లుగా ఖరారు చేశారు. గతంలో సింగిల్ బిడ్ రావడంతో తిరస్కరించి, ఇప్పుడు మళ్లీ వేలానికి తీసుకొచ్చారు.
మరోవైపు మూసాపేటలోని 3.15 ఎకరాల స్థలాన్ని కూడా అధికారులు విక్రయించనున్నారు. ఇక్కడ ఎకరా కనీస ధరను రూ.99 కోట్లుగా నిర్ణయించారు. వీటితో పాటు కోకాపేట్, రాయదుర్గ్ నౌఖల్సా, కాప్రా, బాచుపల్లి, అమీన్పూర్ తదితర తొమ్మిది ప్రాంతాల్లోని స్థలాలను అమ్మనున్నారు. ఈ స్థలాలు 302 నుంచి 8,591 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటికి చదరపు గజానికి రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ధర నిర్ణయించారు.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఇన్ముల్‌నర్వ లేఅవుట్లో 45 ప్లాట్లను వేలానికి ఉంచారు. ఇక్కడ గజం కనీస ధర రూ.15 వేలుగా పేర్కొన్నారు. బాచుపల్లి లేఅవుట్లో 50 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి గజానికి రూ.45 వేలు నిర్ణయించారు. షేక్‌పేట్ మండలం హకీంపేటలో 8 భారీ ప్లాట్లను వేలం వేస్తున్నారు. ఇక్కడ చదరపు గజం ప్రారంభ ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలుగా ఉంది.
ఈ భూములు, ప్లాట్లకు నవంబరు 12 నుంచి 27 వరకు ఈ-వేలం నిర్వహిస్తారు. పాల్గొనే ఆసక్తి ఉన్నవారు హెచ్ఎండీఏ వెబ్సైట్లో రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ప్లాటుకు నిర్ణీత ఈఎండీని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వేలం గెలుచుకున్నవారు వారం రోజుల్లో 25 శాతం మొత్తం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 60 రోజుల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం 7416835522, 7601063358 నంబర్లలో సంప్రదించవచ్చు.

