వ్యక్తిగత వీడియోతో బెదిరించి పెళ్లి చేసుకుని..

బ్రిటన్‌లో ఓ యువతిని వ్యక్తిగత వీడియోతో బెదిరించి, బలవంతంగా పెళ్లి చేసుకుని తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన మహమ్మద్ అలక్కావీ (25) అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 26 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివాహం తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ఆమెపై శారీరక, మానసిక, లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది. బాధితురాలు ‘మాయా’ అనే మారుపేరుతో తన గోడును వెల్లడించింది. ఎట్టకేలకు నిందితుడికి తగిన శిక్ష పడటం తనకు ఊరటనిచ్చిందని ఆమె పేర్కొంది.

2021 సెప్టెంబరులో ఆమె వయసు 20 ఏళ్లు. అప్పట్లో ఆమె పాలస్తీనాలో కుటుంబంతో నివసించేది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అలక్కావీతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే మాటలు పెరిగాయి. రెండు వారాలు తిరగకముందే అతడు పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆ తర్వాత డిసెంబరులో ఆమె రెండు వారాల పర్యటన నిమిత్తం యూకే వెళ్లింది.

అక్కడే అతడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆమెకు తెలియకుండా తీసిన నగ్న వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. మాట వినకపోతే ఆ వీడియోలను ఆమె కుటుంబానికి, స్నేహితులకు, పనిచేసే యజమానికి పంపిస్తానని బెదిరించాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువతి అతడి ఒత్తిళ్లకు తలొగ్గింది. మరుసటి ఏడాది లండన్ చేరగానే హడావుడిగా మతపరమైన నిబంధనల ప్రకారం వివాహం చేసుకున్నాడు.

పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడానికి అతడు నిరాకరించాడు. దీనికి గల కారణాన్ని ఆరా తీస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అతనికి అప్పటికే ఓ భార్య, మరో మహిళ ద్వారా కవల పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పెళ్లయిన నాటి నుంచే ఆమె జీవితం నరకంగా మారింది. వెంటనే గర్భం దాల్చాలని రోజూ రాత్రి బలవంతంగా గర్భధారణ పరీక్షలు చేయించేవాడు. ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా వికృత లైంగిక దాడులకు దిగాడు.

గర్భం దాల్చిన తర్వాత కూడా హింస ఆగలేదు. వండిన స్పఘెట్టిలో మాంసం, పాస్తా సరిగ్గా కలపలేదని ముఖంపై వేడి ఆహారం విసిరి కొట్టాడు. వీపుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. సిగరెట్లతో శరీరంపై కాల్చి రాక్షసానందం పొందాడు. ప్రభుత్వం ఇచ్చే యూనివర్సల్ క్రెడిట్ సహాయాన్ని సైతం లాక్కున్నాడు. ఏది కొనాలన్నా అతని అనుమతి తప్పనిసరి చేశాడు.

రెండో బిడ్డ సమయంలో ఆమెను మెట్లపై నుంచి తోసేందుకు యత్నించాడు. అది చూసిన బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. కింగ్‌స్టన్ క్రౌన్ కోర్టు విచారణలో నిందితుడు బలవంతపు పెళ్లి, అత్యాచారాలు, బెదిరింపులు, గొంతునులిమి చంపేందుకు యత్నించిన కేసుల్లో దోషిగా తేలాడు.

న్యాయమూర్తి సైమన్ హెప్టన్‌స్టాల్ అతనికి 26 ఏళ్ల ఆరు నెలల కఠిన కారాగార శిక్ష ఖరారు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ కౌన్సెలింగ్, థెరపీ కోర్సులు చదువుతోంది. భవిష్యత్తులో చిన్నారుల కోసం పుస్తకాలు రాయాలని ఆమె ఆశిస్తోంది. దౌర్జన్యాలను నిశ్శబ్దంగా భరించకుండా గళమెత్తాలని, హింస ముగిసిన తర్వాత కూడా గౌరవప్రదమైన జీవితం ఉంటుందని ఆమె పిలుపునిచ్చింది.