ఈ వయసులో ఇదేంది.. బామ్మా!

హైదరాబాద్‌లో ఓ విస్తుపోయే ఉదంతం వెలుగుచూసింది. 75 ఏళ్ల వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టయింది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన షేక్‌ జతిన్‌ బీ (75) భర్తతో విడిపోయింది. ప్రస్తుతం ఫతేనగర్‌లోని ఎల్బీఎస్‌ నగర్‌లో కుమార్తె మున్నీ బేగం కుటుంబంతో ఉంటోంది. 2017లో కుటుంబంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. డబ్బు సంపాదించేందుకు వీరంతా కలిసి గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఈ అక్రమ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు.

కుటుంబసభ్యులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇంట్లో కూర్చుని వాటిని 4 నుంచి 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాలుగా కడతారు. జతిన్‌ బీ ఇంట్లోనే ఉంటూ ఒక్కో పొట్లాన్ని రూ.500 చొప్పున కస్టమర్లకు విక్రయిస్తుంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె ఆరుసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లింది. అయినా తీరు మార్చుకోకుండా బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తోంది.

ఇటీవల కాలంలో ఈమె పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ బృందం నిఘా పెట్టింది. శనివారం రాత్రి ఆమె ఇంటిపై ఆకస్మిక దాడి చేసి జతిన్‌ బీతో పాటు మరో ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమె నివాసం నుంచి 179.1 గ్రాముల గంజాయి, రూ.43 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలి కుటుంబ సభ్యులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న ముగ్గురు మైనర్లు సహా 69 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.