ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో అత్యంత హేయమైన సంఘటన వెలుగుచూసింది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, అనంతరం అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
సంతనూతలపాడు మండలానికి చెందిన ఒక నిరుపేద దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారి ఆరేళ్ల కుమార్తె అమ్మమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఒంగోలు మండలం గుడిమెట్లపాడుకు చెందిన అజ్జం ఆనంద్ (25) అనే యువకుడు గ్రామంలో జులాయిగా తిరిగేవాడు. అతను గంజాయి, మద్యానికి బానిసయ్యాడు.
ఆదివారం అర్ధరాత్రి వేళ అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఆనంద్ బలవంతంగా ఎత్తుకెళ్లాడు. తన ఇంటికి తీసుకెళ్లి బాలిక నోట్లో గంజాయి, గుడ్డలు అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై తీవ్ర చిత్రహింసలు పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక మరణించడంతో మృతదేహాన్ని సమీపంలోని పాడుబడిన ఇంట్లో పడేసి తప్పించుకోవాలని చూశాడు.
అనుమానాస్పదంగా కనిపించిన ఆనంద్‌ను స్థానికులు నిలదీయడంతో అతడు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత బంధువులు 216 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్, ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఓదార్చి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

