ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైంది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో అర్ధరాత్రి నుంచే ఘర్షణ వాతావరణం నెలకొంది. వివాహ వేడుకకు వచ్చిన వారి కార్లు, ట్రాక్టర్‌ను కొందరు దుండగులు తగులబెట్టారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. మద్యం సేవించి గూండాలు స్వైరవిహారం చేశారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

పోలింగ్ మొదలైన తర్వాత పులివెందులలో ఉద్రిక్తత మరింత పెరిగింది. దొంగ ఓట్లను నమోదు చేయించేందుకు ప్రత్యర్థులు పన్నాగం పన్నారని ఆరోపణలు వచ్చాయి. బూత్ నెంబర్ 17 వద్ద పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బూత్ నెంబర్ 38 వద్ద కర్రలతో కొందరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుని, వారి ఫారాలను చించేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ వర్గీయులు గుంపులుగా తిష్ట వేశారని సమాచారం. పోలింగ్ బూతుల్లోకి కేవలం టీడీపీ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అభ్యర్థులకు కనీసం పోలింగ్ సరళిని పరిశీలించే అవకాశం కూడా ఇవ్వడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 11,378 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నగరాల్లో 6,384 కేంద్రాలు, మున్సిపాలిటీల్లో 4,994 కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ఎన్నికల బందోబస్తు కోసం 36,351 మంది పోలీసులను మోహరించారు. 13 మేయర్ పదవులకు 153 మంది, 804 కార్పొరేషన్ డివిజన్లకు 3,073 మంది పోటీ పడుతున్నారు. 70 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు 367 మంది, 2,382 వార్డు కౌన్సిలర్ పదవులకు 6,669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు సహా వేలాది మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.