అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల ప్రాంగణంలోనే ఓ బాలికపై ఉన్మాది దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలికను ఆయన స్వయంగా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవడానికి అన్ని విధాలా నాణ్యమైన చికిత్స అందించాలని కోరారు.
బాధిత కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

