రాప్తాడులో దారుణం.. ఉన్మాదిపై పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం జరిగింది. జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. అడ్డువచ్చిన లక్ష్మి అనే మరో విద్యార్థినిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హేమంత్ ఆత్మకూరు అడవి ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. పొదల్లో నక్కిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమంత్ పోలీసులపైకి తిరగబడ్డాడు.

నిందితుడు ఇనుప ముక్కతో రాప్తాడు సీఐ వెంకటేష్‌పై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో సీఐ ఎడమ భుజం కింద గాయమైంది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కూడా కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు వెనక్కి తగ్గలేదు.

పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపైకి కాల్పులు జరిపారు. హేమంత్ రెండు మోకాళ్ల కింది భాగంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన పోలీసు అధికారులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం సీఐ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ వెల్లడించారు. బాలికపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల అయ్యవారిపల్లి గ్రామస్థులు ఊరట వ్యక్తం చేశారు.