ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 13 నగర కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13 నగరాల్లో మేయర్, 804 డివిజన్ల కార్పొరేటర్ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. అదే విధంగా 79 మున్సిపాలిటీల్లో 2,382 వార్డు కౌన్సిలర్లు, 70 చైర్మన్ పదవులకు ఫలితాలు తేలనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 138 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు చేపట్టారు.

కౌంటింగ్ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్‌కు సంబంధించి 10 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన 12 కార్పొరేషన్లలో ఒక్కో కేంద్రం కేటాయించారు. కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 4,026 టేబుళ్లు సిద్ధం చేశారు. 79 మున్సిపాలిటీల్లోని 116 కేంద్రాల్లో 2,805 టేబుళ్లు ఏర్పాటు చేశారు. లెక్కింపు విధుల్లో 47,817 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పర్యవేక్షణ కోసం 1,372 సీసీ కెమెరాలను నిఘాగా ఉంచారు. రాత్రి 8 గంటల లోపు లెక్కింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావం కౌంటింగ్‌పై తీవ్రంగా పడింది. విజయవాడలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకోవడం ఆలస్యమైంది. అధికారుల సమన్వయ లోపం వల్ల అక్కడ గంట ఆలస్యంగా ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.

తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ వాయిదా పడింది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌ను కలెక్టర్ తాత్కాలికంగా నిలిపివేశారు. అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లోనూ లెక్కింపును వాయిదా వేశారు. తుఫాన్ ఉధృతి తగ్గిన తర్వాతే అక్కడ లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే చీరాల మున్సిపాలిటీ కౌంటింగ్‌ను ఉదయం 11 గంటలకు రీషెడ్యూల్ చేశారు. అంతకుముందు సోమవారం జరిగిన రీపోలింగ్‌లో 60.64 శాతం ఓటింగ్ నమోదైంది.