ఫోన్ పగలగొట్టాడని తండ్రిని చంపిన కూతురు!

గుజరాత్‌లోని సూరత్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రి తన ఫోన్‌ను నేలకేసి కొట్టాడన్న కోపంతో కన్న కూతురే కసాయిగా మారింది. కుక్కర్ మూత, కత్తితో తండ్రిపై దాడి చేసి ప్రాణాలు తీసింది.

ఈ సంఘటన అక్టోబర్ 31వ తేదీ రాత్రి అమ్రోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసాడ్ ఆవాస్ ప్రాంతంలో జరిగింది. రమేశ్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌ తన కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఇంటి పనుల విషయంలో 22 ఏళ్ల కూతురు కాజల్‌ను ఆయన మందలించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో తండ్రి ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టారు.

ఫోన్ పగిలిపోవడంతో కాజల్ తీవ్ర ఆవేశానికి లోనైంది. వెంటనే ఇంట్లోని ప్రెషర్ కుక్కర్ మూత తీసుకుంది. దాంతో తండ్రి తలపై బలంగా కొట్టింది. అంతటితో ఆగకుండా వంటగదిలోని కత్తి తెచ్చి ఆయన పొట్టలో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన రమేశ్‌సిన్హ్‌ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి బయటకు పరిగెత్తారు. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో బయట అరుగు వద్ద కుప్పకూలిపోయారు.

కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆయనను పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం మృతుడి భార్య మంజుబెన్ అమ్రోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాజల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితురాలిని కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చిన్నపాటి కుటుంబ వివాదం హత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.