చంద్రబాబు చేస్తున్నది భారీ స్కాం: జగన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ ముసుగులో కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజల సంపదను దోచుకునే పక్కా స్కాం అని ఆయన విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువచ్చామని జగన్ గుర్తుచేశారు. అందులో ఐదు కాలేజీలను తామే ప్రారంభించామని, మరో మూడు కాలేజీలు తరగతులకు సిద్ధమయ్యాయని తెలిపారు. కేవలం ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తిగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు చేయకుండా, కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు, ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరలకు లీజుకు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రైవేటు సంస్థలకు వీజీఎఫ్ పేరుతో ఏకంగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. వైద్య సిబ్బందికి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించాలనే నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ నిర్ణయం అమలు చేయడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ స్కామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు.