తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో పది ప్లస్ టూ (10+2) విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో విద్యాశాఖ అధికారులతో ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానంపై పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేకంగా విద్యను అందించాలని సీఎం సూచించారు. ఆధునిక ప్రపంచ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యంగా 12వ తరగతి నుంచి విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 12వ తరగతి వరకు ఒకే విధమైన విద్యా విధానం అమల్లో ఉందని సీఎం గుర్తుచేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

