ఉత్తర్ప్రదేశ్లో ఒక వింతైన, హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. తన మరణం తర్వాత కూతురికి ఎలాంటి ఆర్థిక, సామాజిక ఇబ్బందులు కలగకూడదని ఒక తండ్రి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాణాలతో ఉండగానే తన పెద్దకర్మ (13వ రోజు కార్యక్రమం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
బాగ్పత్ జిల్లా జోహ్రి ప్రాంతానికి చెందిన భల్జోర్ సింగ్ వయసు 80 ఏళ్లు. ఆయనకు కుమారులు లేరు. పింకీ అనే ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఆమెకు వివాహమై ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు తన కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉంటోంది.
సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమారులు అంత్యక్రియలు, పెద్దకర్మ నిర్వహిస్తారు. తనకు కొడుకులు లేకపోవడంతో, తాను చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలన్నీ కూతురు పింకీపైనే పడతాయని భల్జోర్ సింగ్ భావించారు. ఆమెకు ఇప్పటికే ఉన్న కుటుంబ బాధ్యతలకు తోడు, తన అంత్యక్రియల భారం కూడా మోపడం ఇష్టం లేదని ఆయన నిర్ణయించుకున్నారు.
అందుకే తాను బతికుండగానే తన పెద్దకర్మను స్వయంగా జరిపించుకోవాలని నిశ్చయించుకున్నారు. సంప్రదాయబద్ధంగా అన్ని క్రతువులను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కలిపి దాదాపు 900 మందిని ఆహ్వానించారు. వచ్చిన వారందరికీ స్వయంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి సంతృప్తి పరిచారు.
తన తదనంతరం కూతురిపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పని చేశానని భల్జోర్ సింగ్ తెలిపారు. కన్నకూతురిపై ఆ తండ్రి చూపిన ప్రేమ, బాధ్యత చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఆ వృద్ధుడి ఆలోచనను, కూతురి పట్ల ఆయనకున్న ఆప్యాయతను ప్రశంసిస్తున్నారు.

