ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాలే లక్ష్యంగా బయటి ప్రాంతాల నుంచి రౌడీ మూకలను దిగుమతి చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 23 పురపాలక సంస్థలు, పంచాయతీలకు ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు మకాం వేసి ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్నారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానాల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఉప్పలపాడు, చిన్నతురకపాలెం, గోనేపూడి గ్రామాలకు కేంద్రమైన ఎలమందలో మాచర్ల ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు తిష్ట వేశారు. ఇస్సపాలెంలో నామినేషన్ వేయడానికి వచ్చిన ములకలూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి షేక్ మస్తాన్బీని టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితులపైనే పోలీసులు లాఠీచార్జి చేయడం గమనార్హం. కాకానిలో పెట్లూరివారిపాలెం అభ్యర్థి వెంకాయమ్మ, మద్దతుదారు నాగయ్యపై దాడి చేసి నిర్బంధించారు.
రొంపిచర్ల మండలం విప్పర్లలో నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీలోని రెండు వర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. పోలీసులు తనిఖీలు చేపట్టగా, టీడీపీ నేత గుండా సత్యనారాయణ ఇంట్లో పెట్రోల్ బాంబులు, కత్తులు లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోనూ టీడీపీ గూండాలు స్వైర విహారం చేశారు. ఒక్కో నామినేషన్ కేంద్రం వద్ద వందలాది మంది మోహరించి 10వ వార్డు అభ్యర్థి పత్రాలను చించివేశారు. తొట్టంబేడు మండలం పెద్దకన్నలిలో కొత్తకండ్రిగ అభ్యర్థి రామచంద్రారెడ్డి నామినేషన్ పత్రాలను చింపి, మద్దతుదారులపై దాడి చేశారు. అక్కుర్తిలో సర్పంచ్ అభ్యర్థి ఇంటి పన్ను రసీదును ఎమ్మెల్యే పీఏ చించివేసి దౌర్జన్యానికి దిగారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట కేంద్రంలోకి మంత్రి స్వయంగా వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను చించివేశారని ఆరోపణలు వచ్చాయి. మహిళా అభ్యర్థులపైనా నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డారు. సిబ్యాల, వెలిగల్లు, చిన్నమండెం ప్రాంతాల్లో కర్రలు, రాడ్లతో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.
మరోవైపు, ప్రతిపక్ష నేతలు బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్వేచ్ఛగా నామినేషన్ వేసే రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.

