మహబూబ్నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య వేధింపులు భరించలేక ఓ యువకుడు తన తల్లిదండ్రులకు కన్నీటి సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడికి వివాహమైంది. అయితే, గత కొంతకాలంగా భార్య తనను తీవ్రంగా వేధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
తన భార్య తరచూ గొడవలు పెట్టుకుంటూ, బూతులు తిడుతూ, కొడుతూ అందరి ముందు తన పరువు (ఇజ్జత్) తీస్తోందని శివప్రసాద్ వీడియోలో వాపోయాడు. అంతేకాకుండా, ఏదైనా సమస్య వస్తే పెద్ద మనుషుల ముందు తననే తప్పుగా చిత్రీకరిస్తూ అవమానిస్తోందని కన్నీరు పెట్టుకున్నాడు. చట్టాలు ఆడవారి వైపే ఉన్నాయనే ధీమాతో తన జీవితంతో ఆడుకుంటోందని ఆరోపించాడు. తనను కొడుతూ, కొరుకుతూ పిచ్చివాడిని చేస్తోందని, నువ్వు చనిపో అంటూ వేధిస్తోందని ఆ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
“నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి” అంటూ తన తల్లిదండ్రులకు చివరి సందేశం పంపి శివప్రసాద్ స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరాడు. హైదరాబాద్ వైపు వెళ్లిన అతడు, కొత్తూరు వద్ద తన స్కూటీని నిలిపివేసి అదృశ్యమయ్యాడు. వీడియో చూసి తీవ్ర ఆందోళనకు గురైన శివప్రసాద్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కొత్తూరు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు.

