నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వీరి కుటుంబంలో మనస్పర్థలు, కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సంగీత నిర్మల్ పట్టణంలోని ఒక ఐదంతస్తుల భవనం పైకి ఎక్కింది. భవనం అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో చుట్టుపక్కల వారు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనం పైకి వెళ్లి సంగీతతో మాట్లాడుతూ, ఆమెను శాంతింపజేసి కిందికి దిగాలని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ఆమె దృష్టిని మళ్లించి రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే, పోలీసుల మాటలు విన్నట్లే నటించిన సంగీత.. ఒక్కసారిగా వారిని ఏమార్చి భవనం పైనుంచి కిందికి దూకేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కింద పడటంతో సంగీతకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు కలిసి రక్తపు మడుగులో ఉన్న ఆమెను 108 అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

