పవన్ కల్యాణ్ అభిమానుల్లో అభిమానం ఆసక్తికరమైన మలుపు తీసుకొంటోంది. తమ అభిమాన హీరో ని సీఎంగా చూసుకోవాలని వారు తపించిపోతున్నారు.
తాజాగా ఇలాంటి కోరికతో ఒక అభిమాని తిరుపతిలో పొర్లుదండాలు చేయడం ఆసక్తికరంగా మారింది. తమ అభిమాన హీరోని కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్నాడు ఆ అభిమాని. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని. .అందుకే వెంకటేశ్వర స్వామికి ఈ కోరికను విన్నవించుకొంటున్నట్టుగా ఆ అభిమాని పేర్కొన్నాడు.
మరి ఇంత వరకూ పవన్ కల్యాణ్ అభిమానులు తమ హీరోని అభిమానించడం జరిగింది కానీ.. ఇలా ఆయన సీఎం కావాలని .. ఇలా పూజలు, ప్రార్థనలు చేసింది మాత్రం లేదు. ఇప్పుడు తొలిసారి ఒక అభిమాని మొదలు పెట్టాడు. రానున్న రోజుల్లో ఇది ఈ ప్రార్థనలు ఏ స్థాయికి చేరతాయో అనేది ఆసక్తికరమైన అంశమే. ఇదే సమయంలో పవన్ ను కాబోయే సీఎం అంటూ సంబోధించడం కూడా జరుగుతోంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక రెడ్ సిగ్నలే. ఇంత వరకూ జనసేన అధినేత టీడీపీ మనిషిగా ఉంటూ వస్తున్నాడు. అభిమానులేమో ఇప్పుడు ఆయనను కాబోయే సీఎం అని అంటున్నారు.
మరి తెలుగుదేశం వాళ్లు చూస్తే.. రాబోయే ఇరవై ఏళ్లూ చంద్రబాబు, లోకేష్ బాబులే సీఎంలుగా ఉంటారని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ అభిమానుల కోరిక తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే అంశమే అవుతుంది. మరి ఇంతకీ అభిమానుల కోరిక విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తాడో!