వైఎస్ కుటుంబీకుల అంగీకారం కోసం వెయిటింగ్
బయోపిక్‌లు అనేవి ఈ నడి మధ్య సినీ పరిశ్రమలో బాగా ట్రెండింగ్ అవుతున్న అంశం. ఇంతకముందు బయోపిక్‌లు అంటే దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు, ప్రముఖులలపై తీసేవారు. ఇప్పుడు బయోపిక్‌లు రాజకీయాలపై మళ్లింది. రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి బయోపిక్, రాజీవ్ గాంధీ హత్య, పరిటాల రవి తదితర బయోపిక్‌లు వచ్చాయి.. వస్తున్నాయి. ఇప్పుడు వీటిలో కొత్తగా ఒకటి వచ్చి చేరనుంది.
అధికారం లేక చావు దెబ్బ తిన్న కాంగ్రెస్‌కు పాదయాత్రతో ఊపిరి పోసి పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారి అధిష్టానంతో ఢీ అంటే ఢీ అనేంత స్థాయికి వెళ్లాడు. అందరినీ కలుపుకుంటూ తనకు వ్యతిరేకంగా ఎవరూ లేకుండా చూసుకొని ఏకంగా ఆరున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చక్కని పాలన అందించి పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రపై ఓ సినిమా తీయనున్నారట. దీనికి `యాత్ర`గా టైటిల్ ఫిక్స్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో రెండు హిట్ సినిమాలు అందించిన ఓ సంస్థ వైఎస్సార్ బయోపిక్ కోసం మాంచి స్క్రిప్ట్ రెడీ చేయించిందంట. ఓ మంచి దర్శకుడి వేటలో పడింది. దాంతో పాటు వైఎస్ కుటుంబ సభ్యుల, సంబంధికుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిన త్వరలో కలవనున్నారట. జగన్ అనుమతి తర్వాత స్క్రిప్ట్ పూర్తి చేసి అందరూ ఒకే అన్న తరువాత సినిమాను పట్టాలపైకి ఎక్కించనున్నారట.
అయితే వైఎస్సార్ మరణం తర్వాత అతడి జీవితంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమా తీయాలనుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో కుదరలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో వైఎస్ పాత్ర ఎవరు పోషిస్తారో? నని ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా 2019 ఎన్నికల సమీపంలో విడుదల చేస్తే రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.