సినీ పరిశ్రమలో జీవిత కథ (బయోపిక్) సినిమాలు ఎక్కువవుతున్నాయి. మొన్న పరిటాల రవి, ధోని, సచిన్ టెండూల్కర్, దంగల్, ప్యాడ్‌మ్యాన్, మేరికోమ్ తదితర సినిమాలు రాగా ప్రస్తుతం మరికొన్ని జీవిత చరిత్ర నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ఇందిరాగాంధీ, సావిత్రి, ఎన్టీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలపై సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఇలాంటి సినిమానే ఒకటి విడుదల కాబోతోంది. ఈ వార్త మాత్రం టాలీవుడ్‌కు షాకిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జీవిత చరిత్రపై ఓ సినిమా వస్తుందనే విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడి జీవిత చరిత్రపై ‘చంద్రోదయం’ సినిమా తీశారంట. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యి విడుదలకు సిద్ధమైందంట. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆ సినిమా విడుదల చేస్తారని ప్రకటించారు.
కథ, దర్శకత్వం, నిర్మాతగా పసుపులేటి వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. ‘చంద్రోదయం’ సినిమాలో చంద్రబాబు పాత్రలో రఘువర్మ అనే వ్యక్తి నటించారు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 23)న విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో విడుదల చేశారు. అయితే ఈ సినిమాను చంద్రబాబుకు చూపించగా ఆయన ఓకే చెప్పారని సమాచారం. బాబు పుట్టిన రోజు నాడే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి చంద్రబాబుపై ఓ సినిమా వస్తుండడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.