గట్టిగా నాలుగేళ్ళు కూడా చంద్రబాబును భరించలేకపోయాడు చల్లా రామకృష్ణారెడ్డి. పార్టీలో చేర్చుకునే సందర్భంలో ఎన్నికల సమయంలో జనాలకు హామీలిచ్చినట్టుగా తీయని మాటలు చెప్పడం…… ఒకసారి పార్టీలో చేరిన వెంటనే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన ప్రజల విషయంలో తన మార్క్ కుట్ర రాజకీయాలను చూపించినట్టుగానే నాయకుల విషయంలో చూపిస్తున్నాడు చంద్రబాబు. ఇదే విషయాన్ని ఇప్పటికే చాలా మంది నేతలు బహిరంగంగానే చెప్పేశారు. భూమా నాగిరెడ్డి చావుకు కూడా చంద్రబాబే కారణం పరోక్షంగా భూమా అఖిలప్రియ కూడా వాపోయింది.
ఇప్పుడు చల్లా రామకృష్ణారెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎస్ హయాంలో వైఎస్‌కి సన్నిహితుడిగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డికి కాస్త సీనియార్టీతో పాటు అనుభవం, ప్రజాదరణ కూడా ఉంది. అందుకే చంద్రబాబుకు కూడా చల్లాకు ఎన్నో హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నాడు. అయితే నాలుగేళ్ళుగా తన చుట్టూ తిప్పుకున్న చంద్రబాబు, ఎదురుచూసేలా చేసిన చంద్రబాబు చివరకు ఆర్టీసీ కడప రీజినల్ సంస్థలో నామ్ కే వాస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాడు. దాంతో చల్లాకు చంద్రబాబు రాజకీయం స్పష్టంగా అర్థమైంది. నాలుగేళ్ళుగా చంద్రబాబు తనకు నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే వైఎస్సార్ ఆదరణను కూడా గుర్తుచేసుకున్న చల్లా జగన్‌కి తన తరపున రాయబారం పంపించాడు. ఎలాంటి షరతులూ లేకుండా పార్టీలో చేరడానికి రెడీ అనీ వైకాపాలో ఉన్న కీలక నేతతో జగన్‌కి సమాచారం పంపించాడు చల్లా. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వైకాపాలోకి చేరడానికి రెడీగా ఉన్నాడు చల్లా. చల్లా నియోజకవర్గంలోని ప్రజలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా చంద్రబాబును అస్సలు నమ్మొద్దని……హామీలు ఏమీ ఇవ్వకపోయినా జగన్‌నే నమ్ముకుందామని, జగన్‌తో కలిసి నడుద్దామని చల్లా రామకృష్ణారెడ్డి అనుచరులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం గమనార్హం. ఇప్పటికే చాలా మంది నేతలు 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయం అని భావించడం, ప్రజలతో పాటు నాయకులను కూడా మోసం చేస్తున్న చంద్రబాబును భరించలేని కారణాలతో వరుసగా వైకాపాలో చేరుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి కూడా చేరడం గమనార్హం.