ప్రత్యక్ష ఎన్నికల ఘట్టం దాదాపుగా ముగిసింది. ఇక ప్రభుత్వానికి ఇప్పట్లో ప్రజల ఓట్లతో అవసరం లేనట్లే. దీంతో ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకోబోతోంది. తొలి దెబ్బగా.. తెలంగాణలోవిద్యుత్ చార్జీలను పెంచనుంది. వచ్చేఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రజల వీపునచార్జీలమోతమోగనుంది.
వినియోగదారులకు షాక్ ఇచ్చేలా చార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం భారీగా ఉందని డిస్కంలు తమ నివేదికల్లో పొందుపరిచాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.30,207 కోట్ల రూపాయలు అవసరమని డిస్కంలు ప్రతిపాదించాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ ప్రకారం తమకు రూ.21,418 కోట్లు సమకూరుతుందని డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి. రెవిన్యూ లోటు రూ.8,789 కోట్లను సమకూర్చుకోవాలంటే ప్రజలపై భారం మోపడమొక్కటే మార్గమని డిస్కంలు ప్రతిపాదించాయి. ప్రతి యూనిట విద్యుదుత్పత్తికి రూ6.44 ఖర్చవుతోందని.. దీన్ని రూ.4.56లకే సరఫరా చేస్తున్నామని.. ఈ కారణంగా డిస్కంలకు ప్రతి యూనిట్ కూ 88 పైసల భారం పడుతోందని డిస్కంలు ఈఆర్సీకి సమర్పించిన నివేదికలో తెలిపాయి. 500 యూనిట్లలోపు విద్యుత్ ను వాడే వారి నుంచి ప్రతి యూనిట్ కు సుమారు 70 పైసలు, ఆపైబడ్డ విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతి యూనిట్ కు సగటున ఒక్క రూపాయి వసూలు చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. వినియోగదారులపై చార్జీల వడ్డన ద్వారా రూ.1,958 కోట్లు సమకూర్చుకుంటామని, మిగిలిన మొత్తంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని డిస్కంలు కోరుతున్నాయి.
పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ చార్జీలను కూడా భారీగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదిస్తున్నాయి. పరిశ్రమలపై 6శాతం, వాణిజ్య విద్యుత్ పై పది శాతం మేర చార్జీలు పెంచాలని భావిస్తున్నారు. కుటీర పరిశ్రమలకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఈ పెంపు భారం పడకుండా చూస్తామని డిస్కంలు ప్రతిపాదిస్తున్నాయి.
