ఉత్తర్ ప్రదేశ్‌లో అలీఘడ్ పోలీసుల మీడియా సాక్షిగా ఇద్దరు హంతకులను ఎన్ కౌంటర్ చేసిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. తాము ఎన్ కౌంటర్ చేసేందుకు వెళుతున్నామని ముందుగానే మీడియాకు చెప్పి, వారిని మచువా గ్రామానికి తీసుకెళ్లిన పోలీసులు, ఇద్దరు హంతకులను కాల్చి చంపారు.
బైక్‌పై వెళుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముస్తకిమ్, నౌషద్‌లను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ, పోలీసుల కళ్లుగప్పి సమీపంలోని ఓ పాత బిల్డింగ్‌లో వారు తలదాచుకున్నారు. పెద్దమొత్తంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవాడానికి ప్రయత్నించగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మరి కాసేపట్లో లైవ్ ఎన్‌కౌంటర్ ఉంది..మీడియా వచ్చి కవర్ చేయండి అంటూ పోలీసుల నుంచి మీడియాకు ఆహ్వానం వచ్చింది. స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఎన్‌కౌంటర్‌ని చిత్రీకరించారు.
హతులైన ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా రికార్డులకు ఎక్కిన ముస్తకీమ్, నౌషద్ గా గుర్తించారు. వీరిపై ఆరు హత్య కేసులు, పదికి పైగా దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ తరువాత మృతుల వద్ద కంట్రీ మేడ్ ఫిస్టల్స్ లభించాయి. ఈ ఎన్ కౌంటర్ పూర్తి పారదర్శకమేనని చెప్పేందుకే మీడియాను పిలిచామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ దృశ్యాలు ఇప్పుడు వార్తా చానళ్లలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. ఎన్‌కౌంటర్ గురించి పారదర్శకంగా వ్యవహరించడానికే మీడియాకు ఆహ్వానించామని జిల్లా ఎస్పీ తెలిపారు.