మోదీ మీద వివాదాస్పద ట్వీట్ చేసి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, సినీనటి రమ్య(దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రమ్య కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ గా వ్యవహరించేవారు.అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని, పార్టీలో వేరే పదవి ఆమెకు కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహిరించే రమ్యకు లోక్‌సభ ఎన్నికలో నేపథ్యంలో మరో కీలక పదవిలో ఆమెను నియమిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై అమె చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారడంతోనే పదవి నుంచి తప్పుకున్నారని పార్టీ నేతల భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను అభ్యంతరకరమైన రీతిలో ట్వీట్ చేసినందుకు దివ్య స్పందనపై ‘దేశద్రోహం’ కేసు నమోదైంది. వివాదాస్పద రఫేల్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలకు మోదీ స్పందించడం లేదని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశ్నించడంతో పాటు మోదీని ‘దొంగ’గా అభివర్ణించారు. ఓ ఫోటోను కూడా ట్వీట్‌కు జోడించడంతో అది కాస్త వివాదాస్పదంగా మారింది.
దీనిపై తీవ్రంగ స్పందించిన బీజేపీ.. దేశ ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేశారని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దేశ ఖ్యాతిని ,సార్వభౌమాధికారాన్ని దిగజార్చే విధంగా ఆమె ట్వీట్ ఉందని ఢిల్లీకి చెందిన న్యాయవాది సైయ్యద్ రిజ్వార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె రాజీనామా వార్తలకు కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ద్రువీకరించాల్సిఉంది.