ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక రాజకీయం…ఇప్పటి నుంచి మరో రాజకీయం చూడబోతున్నారు. నిన్నటి వరకు వైసీపీ, టీడీపీ మధ్యనే రాజకీయం నడిచింది. ఇప్పుడు మాత్రం పవన్, జగన్ మధ్య రసవత్తర రాజకీయం నడవబోతోందని విశ్లేషకులు చెప్తున్న మాట.
అసలు విషయానికి వస్తే ఈమధ్యన జగన్‌మీద ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతున్నారు పవన్. గతంలో కూడా ఎన్నడూ ఇంత దారుణంగా విమర్శించిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పవన్ తన స్వరాన్ని పెంచుతున్నారు. అధికార పార్టీ టీడీపీ చేస్తున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక పాలనపై పవన్ స్వరం పెంచితే ప్రజలు హర్షించేవారు. కాని ఏపీ ఖర్మ ఏంటో గానీ ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు చేయడం అలవాటుగా మారింది.
అయితే పవన్ చేస్తున్న వ్యాఖ్యలను ఉపేక్షిస్తే ఇక లాభం లేదని సీరియస్‌గా తీసుకోవాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారంట. ఇలా వదిలేస్తే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెల్తాయని…దాని ద్వారా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
ఇక పవన్ ను టిడిపి కి మిత్రుడుగా ప్రచారం చేయాలని..పవన్ వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పి కొట్టాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఇక నుండి పవన్ వర్సెస్ జగన్ గా ఏపి రాజకీయంలో కొత్త కోణం కనిపంచనుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
జగన్ స్థానంలో తాను ఉంటే ఒక్కడిగా అయినా అసెంబ్లీ కి వెళ్లి ప్రభుత్వ అవినీతి పై పోరాడేవాడినని పవన్ చెప్పుకొస్తున్నారు. జగన్ శక్తి సామర్ధ్యాల పై మీద పవన్ అనేక విమర్శలు చేసారు. ఇక, జగన్ అవినీతి పైనా..వేల కోట్లు దోచుకున్నారంటూ..16 నెలలు జైళ్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడని పవన్ ప్రశ్నిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి తాను జగన్ వ్యక్తిగత విషయాలు బయట పెడితే తట్టుకోలేరని హెచ్చరిస్తున్నారు.
పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ అంతర్మథనం మొదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పవన్ వ్యాఖ్యలకు తగిన రీతలో స్పందించకుంటే నష్టమేనని వైసిపి అంచనాకు వచ్చింది. దీంతో..ఇక టిడిపి తో సమానంగా పవన్ ను లక్ష్యంగా చేసుకోవాలని వైసిపి నిర్ణయించింది. పవన్ కళ్యాన్ ను టిడిపికి మేలు చేసే వ్యక్తిగానే ప్రచారం చేయాలని వైసిపి డిసైడ్ అయింది.