ఇదో చిత్రమైన పరిస్థితి! ఆయనేమో రాష్ట్ర మంత్రి, ఆమె ఒక మరాఠీ హీరోయిన్. ఇద్దరికీ పరిచయం లేదు. కానీ, ఆ హీరోయిన్ వెబ్‌సైట్ వల్ల సదరు మంత్రిగారికి అనుకోని చిక్కు వచ్చి పడింది! అసలు విషయం ఏంటంటే… మహారాష్ట్రలో మంత్రిగారు సుభాష్ దేశాయ్. ఆయన ఫోన్ నంబర్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. దీంతో వరుస ఫోన్లు మోగిపోతుండటంతో చివరికి స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ ఫోన్ నంబర్ ఎలా పాపులర్ అయిపోయిందంటే… మరాఠీ నటి రింకూ రాజ్ గురు వల్ల.
ఇందులో ఆమె తప్పు కూడా ఏమీ లేదు.రింకూ రాజ్‌కు ఒక వెబ్‌సైట్ ఉంది. దాన్ని ఈ మధ్యనే ఎవరో హ్యాక్ చేశారు. కాంటాక్ట్ డీటెయిల్స్‌లో ఈ మంత్రిగారి పర్సనల్ ఫోన్ నంబర్‌ను పెట్టేశారు. ఒక హీరోయిన్ వెబ్‌సైట్‌లో.. ఆమె పర్సనల్ ఫోన్ నంబర్ దొరికిందీ అంటే అభిమానులు ఊరుకుంటారా చెప్పండీ! ఇక, మంత్రిగారి మొబైల్ రింగ్ కావడం మొదలైంది. ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరూ… రింకూ మేడమ్ ఉన్నారా అంటూ అడుగుతుండేసరికి ఆయనకి షాక్! ఇలా వరుస పెట్టి కాల్స్ వస్తుండేసరికి అసలు విషయం ఏంటా అని ఆరా తీశారు. చివరికి, తన నంబర్ ఎలా పబ్లిక్ అయిందనే విషయం తెలుసుకున్నారు. చేసేసిలేక మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు.
అయితే, ఈ క్రమంలో సదరు హీరోయిన్‌పై ఆయన ఏమాత్రం సీరియస్ కాలేదు. ఇందులో ఆమె తప్పు మేముంది..? ఎవరో ఆకతాయిలు ఆమె వెబ్‌సైట్ హ్యాక్ చేసి, అక్కడ నా ఫోన్ నంబర్ పెట్టారు. వారెవరా అనేది ఇప్పుడు ఆలోచించాలి అంటూ మంత్రిగారు కూడా స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఆ హ్యాకర్‌లు ఎవరా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మంత్రిగారిని టార్గెట్ చేసుకోవడం ఒకెత్తు అయితే, ఆయన ఫోన్ నంబర్‌ను ఏరికోరి మరీ రింకూ వెబ్‌సైట్ హ్యాక్ చేసి ఎందుకు పెట్టారా అనేది మరో ప్రశ్న. ఏదేమైనా ఈ వ్యవహారం ఇప్పుడు మహారాష్ట్రలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం వల్ల రింకూకు బాగానే పాపులారిటీ వస్తోంది కదా!
