మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఇప్పటివరకు ప్రతీ సోమవారం సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ వస్తున్న విష్ణు…తాజాగా మరో పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విష్ణు మంచు పిల్లలు అరియానా మంచు, వివియానా మంచు బర్త్ డే సందర్భంగా కన్నప్ప సినిమాలోని ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు.
పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసం అని ఈ పోస్టర్లో చూపించారు.
పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోందన్నారు విష్ణు. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్, అర్పిత్ రాంక, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సప్తగిరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. కన్నప్ప..ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది.