సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన బాణీలతో తిరుగులేని ముద్ర వేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు నటుడిగానూ వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’ (Yellamma). ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఆగస్టు 2న డీఎస్‌పీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. చేతిలో కిరీటం పట్టుకుని సరికొత్త రెట్రోలుక్‌లో డీఎస్‌పీ కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘‘ఎల్లమ్మ సినిమా నుంచి పర్షిని పరిచయం చేస్తున్నాం. మట్టి నుంచి పుట్టిన ఈ పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కూడా మీరెప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటివరకు ఆయన సంగీతాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇకపై వెండితెరపై ఆయన నటనను కూడా పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకొందాం. రాక్‌స్టార్ డీఎస్‌పీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే అద్భుతాలను ఈ ప్రపంచం అస్సలు ఊహించలేదు’’ అంటూ ఎల్లమ్మ చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ను బట్టి ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడిగా కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. అంతకుమించిన సరికొత్త, నేటివిటీతో కూడిన కథాంశంతో దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సంగీత ప్రియులకు డీఎస్‌పీ డబుల్ ట్రీట్ ఇచ్చారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) మైలురాయి అయిన 100వ చిత్రం త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రా.కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. గతంలో నాగార్జున – దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘ఢమరుకం’ వంటి మ్యూజికల్ హిట్స్ ఎంతటి ఘనవిజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా మారి కొత్త ప్రయాణం మొదలుపెడుతూనే, మరోవైపు టాప్ స్టార్ ప్రాజెక్ట్‌లకు సంగీతం అందిస్తూ డీఎస్‌పీ బిజీగా గడుపుతున్నారు.
