ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమా కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా లో కోలీవుడ్ నటుడు అథర్వ మురళీ ముఖ్య పాత్ర పోషించగా, పూజ మరియు మృణాలినీ రవి లు హీరోయిన్లుగా నటించారు. టీజర్ మరియు ట్రైలర్ తోని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసిన దర్శకనిర్మాతలు తాజాగా ఇవాళ సెప్టెంబర్ 20న సినిమాను విడుదల చేశారు. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూసేద్దామా..
కథ:
అభి (అథర్వ మురళి) ఎప్పటికైనా ఒక సినిమాకి దర్శకుడిగా మారాలని కలలు కంటూ ఉంటాడు. చేతిలో ఒక స్క్రిప్టు పట్టుకుని బోలెడు నిర్మాతల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక నిర్మాత సినిమా తీయడానికి ఒప్పుకుంటారు. అభి లేని గ్యాంగ్స్టర్ ని పుట్టించడం కంటే ఉన్న గ్యాంగ్స్టర్ మీద సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) మీద రీసెర్చ్ మొదలుపెడతాడు. ఆ ఏరియాలో గణేష్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. అతనికి భయపడని వాళ్ళు ఉండరు. అతనితో మాట్లాడాలంటేనే కొందరు వణికిపోతుంటారు. మరి అలాంటిది అభి గణేష్ పై సినిమా తీయగలిగాడా? గణేష్ ని సినిమా కోసం ఒప్పించడానికి అభి ఎవరి సహాయం తీసుకున్నాడు? చివరికి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
ఈ సినిమాలో వరుణ్ తేజ్ అద్భుతమైన నటన వెన్నెముకగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో వరుణ్ తేజ్ ఒక నటుడిగా అద్భుతమైన పర్ఫామెన్స్ ను చూపించాడు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ కాకుండా ఇంకెవరు అంత ఎనర్జీ తో నటించ లేరేమోనని సినిమా చూస్తే అనిపిస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ వరుణ్ తేజ్ తన పాత్రలోని అన్ని వేరియేషన్స్ ను చాలా చక్కగా తెరపైన పలికించాడు. అధర్వ మురళి నటన కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. తన పాత్రలో చాలా చక్కగా ఒడిగిపోయి అథర్వ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాడు. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది పూజ హెగ్డే. ఇంతకుముందు మిగతా సినిమాల్లో లాగా గ్లామరస్ పాత్ర కాకుండా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కించుకున్న పూజ హెగ్డే తన నటనతో అందరి మనసుల్ని దోచుకుంటుంది. మృణాలినీ రవి నటన కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ మరియు బ్రహ్మాజీ ఉన్న ప్రతి సీన్ ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.
సాంకేతిక వర్గం:
రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ సినిమాని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి సూట్ అయ్యే లాగా కథలో కొన్ని మార్పులు చేసిన హరీష్ శంకర్ ప్రేక్షకులను అలరించడం లో సఫలమయ్యాడు అని చెప్పుకోవాలి. తన నరేషన్ తో ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా కథని చాలా బాగా ముందుకు తీసుకెళ్ళాడు హరీష్ శంకర్. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట అందించిన నిర్మాణ విలువలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకి మంచి బలాన్ని చేకూర్చింది. కేవలం మిక్కీ అందించిన పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మరియు ఎమోషన్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బిజిఎం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అయానంక అందించిన మంచి విజువల్స్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
తీర్పు:
పేరుకి రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు కథను నెరేట్ చేసిన విధానం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యేలా గా హరీష్ శంకర్ కథలో కొన్ని మార్పులను చేశారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం గ్యాంగ్స్టర్ చుట్టూ తిరిగినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. వరుణ్తేజ్ అద్భుతమైన నటన సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అయితే మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ లో కథ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ వరుణ్ తేజ్ నటన మరియు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. నటీనటులు, నేపథ్య సంగీతం, కథ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. రెండవ హాఫ్ లోని కొన్ని సాగతీత సన్నివేశాలు సినిమాకి మైనస్ నిలిచాయి. చివరగా ‘వాల్మీకి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగే ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా.