టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు, తన మార్కు కమర్షియల్ సినిమాల తర్వాత ఈసారి రూట్ మార్చి పూర్తి స్థాయి హారర్ జానర్‌లో ‘అగధ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
టీజర్ ఆరంభం నుంచే భయంకరమైన విజువల్స్, అతీంద్రియ శక్తుల ఉనికిని చాటిచెప్పే డైలాగులతో ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. మనిషి మేధస్సుకు అందని శక్తులు ఉన్నాయని, వాటి పేరే ‘అగధ’ అని కామాక్షి భాస్కర్ల చెప్పే వాయిస్ ఓవర్ ఆసక్తిని కలిగిస్తోంది.
గతంలో ఎం.ఎస్. రాజు అందించిన ‘దేవి’ వంటి సూపర్ హిట్ హారర్ చిత్రాల స్థాయి మేకింగ్ ఇందులో కనిపిస్తోంది. ముఖ్యంగా నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ, మిక్కిన్ అరుళ్‌దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. టీజర్‌లో చూపించిన నరబలి దృశ్యాలు, వింత ఆకృతులు మరియు గ్రాఫిక్స్ (VFX) సినిమా క్వాలిటీని తెలియజేస్తున్నాయి. చిత్రంలో సుమారు 45 నిమిషాల పాటు భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
‘పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల ఇందులో ‘మహాదేవి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ‘డర్టీ హరి’ ఫేమ్ శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్త కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో వనిత విజయ్‌కుమార్ కుమార్తె జోవికా విజయ్‌కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. టీజర్‌లో ఆమె లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
