‘మిర్చి’ తర్వాతనే కొరటాల శివతో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ తెగ ఉత్సాహ పడిపోయాడు. అయితే అప్పట్లో ఆ సినిమా ఎందుకో వర్కవుట్ కాలేదు.
కొరటాల చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చలేదని కొంతమంది అంటారు. అలా కాదు.. కొరటాలే భారీ పారితోషకాన్ని ఆశించి ఎన్టీఆర్ తో సినిమాను పక్కన పెట్టి చరణ్ తో సినిమా చేయడానికి వెళ్లిపోయారని మరికొందరు అంటారు. ఏదైతేనేం.. అప్పట్లో సినిమా పట్టాలెక్కలేదు.
ఆ తర్వాత కొరటాల ‘శ్రీమంతుడు’ సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ సినిమా విడుదల కావడం సంచలన విజయాన్ని నమోదు చేయడం జరిగిపోయింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు మళ్లీ కొరటాల శివ మీద కన్ను పడినట్టుగా తెలుస్తోంది. వరసగా రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడితో ఎలాగైనా ఒక సినిమా చేయాలని.. ఫామ్ లో ఉన్న అతడితో సినిమా చేసి హిట్టు కొట్టాలని ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా తనకో హిట్ ఇవ్వాలని.. ఎన్టీఆర్ కొరటాలను బతిమాలుతున్నాడనే టాక్ కూడా వస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఏమంత గొప్పగా లేదు. సరైన హిట్ దక్కి చాలా కాలం అయిపోయింది. ఈ నేపథ్యంలో సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు తారక్. మరి సుక్కూ సినిమాలు కమర్షియల్ గా వర్కవుటవ్వడం కష్టమే అనే అభిప్రాయాలున్నాయి. బాగానే ఉంటాయి కానీ ఆ సినిమాలకు డబ్బులు రావడం కష్టమే అంటుంటారు. కాబట్టి ఎన్టీఆర్ కొరటాల ను ప్రసన్నం చేసుకోవడానికి మరింతగా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.