Tuesday, April 30, 2024
- Advertisement -

జ్యోతిక ‘ఝాన్సీ’ మూవీ రివ్యూ

- Advertisement -

హీరోయిన్ జ్యోతిక హీరో సూర్య‌ని పెళ్లి చేసుకున్న త‌రువాత సినిమాలు చేయ‌డం మానేసిన సంగ‌తి తెలిసిందే.త‌న భ‌ర్త సూర్య ప్రోత్స‌హ‌కంతో మ‌ళ్లీ త‌న సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది జ్యోతిక.ఆమె లీడ్ రోల్ న‌టించిన నాచ్చియార్ సినిమా త‌మిళంలో పెద్ద హిట్టుగా నిలిచింది.దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు.త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:
ఝాన్సీ(జ్యోతిక) అసిస్టెంట్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తుంటారు. ఓ మైనర్ అమ్మాయి రేప్ కేసుని డీల్ చేయమని ఝాన్సీకి అప్పగిస్తారు. ఈ కేసులో ఝాన్సీ.. గాలిరాజు(జివి ప్రకాష్ కుమార్)ని అరెస్ట్ చేస్తారు. అలానే బాధితురాలు రాశి(ఇవానా)ని కూడా తన అదుపులో ఉంచుకుంటుంది. రాశి గర్భవతి పైగా నెలలు నిండడంతో ఝాన్సీ తనతో పాటే రాశిని ఇంటికి తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటుంటుంది. అయితే రాశి తను ఇష్టపూర్వకంగానే గాలిరాజుతో ఉన్నానని ఎలాంటి బలవంతం లేదని చెబుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న ఝాన్సీ మైనర్లు కావడంతో ఆఫ్ ది రికార్డ్ డీల్ చేయాలనుకుంటుంది.ఇంతలో రాశికి బిడ్డ పుడుతుంది. అయితే ఆ బిడ్డ డిఎన్ఏ.. గాలిరాజు డిఎన్ఏ తో మ్యాచ్ అవ్వదు. ఆ బిడ్డ గాలిరాజుకి పుట్టినవాడు కాకపోతే మరి రాశి ఎందుకు అలా చెబుతుంది..? రాశిని మోసం చేసిందెవరనే విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఝాన్సీ. మరి ఈ కేసులో ఆమెకు అసలైన నిందితులు ఎవ‌రు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
బీద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఒక కుర్రాడిని ప్రేమిస్తుంది. ఇద్దరూ తెలియక తప్పు చేస్తారు. ఆ కారణంగా ఆమె తల్లయ్యిందనుకుంటే దర్శకుడు మరో ట్విస్ట్ రాసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ సినిమాను నడిపించారు. ఇప్పటివరకు దర్శకుడు బాల డైరెక్ట్ చేసిన సినిమాలు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినట్లుగా అనిపిస్తుంది. ఈ కథతో దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మైనర్ ఆడపిల్లలను పనిలో పెట్టుకోవడం ఎలాంటి పాపం తెలియని వారి జీవితాలతో ఆదుకోవడం వంటి విషయాలను దర్శకుడు తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మైనర్ బాలికకు బిడ్డ పుట్టడం, ఆమెను పోలీస్ ఆఫీసర్ రక్షణలో ఉంచడం వంటి సాదాసీదా సన్నివేశాలతో సాగుతుంది. ఎప్పుడైతే ఆ బిడ్డ డిఎన్ఏ గాలిరాజుతో మ్యాచ్ కాలేదని తెలుస్తుందో కథ మలుపు తీసుకుంటుంది. ప్రీక్లైమాక్స్ వరకు కూడా అసలు బాలికను రేప్ చేసిందెవరనే విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించాడు. దీంతో సినిమా చూసే ఆడియన్స్ కు ఎవరై ఉంటారా..? అనే ఆలోచనలు మొదలవుతాయి. అయితే ఈ ఎపిసోడ్ ని మరింత ఆసక్తికరంగా చిత్రీకరించి ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాల్లో నిందుతుడు ఎవరని తెలిసినా శిక్షించలేని స్టేజ్ లో పోలీసులు ఉండడంతో పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ అతడిని అతి క్రూరంగా శిక్షించడం, రాశికి పుట్టిన బిడ్డ తన కారణంగా కలగలేదని తెలిసినా.. గాలిరాజు తను ప్రేమించి అమ్మాయిని, బిడ్డను ఆదరించే సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాయి. క్రైమ్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు జ్యోతికను చూడని ఓ సరికొత్త పాత్రలో ఈ సినిమాలో కనిపించింది. నిజాయితీగా దేనికి లొంగకుండా ధైర్యంగా ఉండే ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జ్యోతిక ఒదిగిపోయింది. తన కనుసన్నల్లోనే కథను మొత్తం నడిపించింది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ చాలా సింపుల్ గా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్ లో జ్యోతిక కళ్లలో నీళ్లు తిరుగుతుంటే చూసే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోతారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చిన్న బిట్ సాంగ్ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కథ ప్రధానంగా సాగే సినిమా కావడంతో టెక్నికల్ అంశాల కంటే కంటెంట్ ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ బాల సినిమాల్లో కనిపించే రానెస్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. టైటిల్స్ వేయడమే డంప్ యార్డ్ ను చూపిస్తారు. రెండు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వెళ్లే ఆడియన్స్ కు ఈ సినిమా చూసి గుండె బరువెక్కడం ఖాయం. రియలిస్టిక్ క్రైమ్ కథలు, బాల సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పిస్తుంది.

బోట‌మ్ లైన్: మైన‌ర్ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై ఝాన్సీ మోపిన ఉక్కుపాదం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -